Pawan Kalyan: వైకాపా మరోసారి అధికారంలోకి రాదు: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: వైకాపా మరోసారి అధికారంలోకి రాదు: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: వైకాపా మరోసారి అధికారంలోకి రాదు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: వైకాపా మరోసారి అధికారంలోకి రాదని, రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడొద్దని పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో.. అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన పవన్‌.. జనసేన భవిష్యత్‌ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యహాలపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

ఆ విషయం వైకాపా నేతలు అర్థం చేసుకోవాలి..

‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై చాలా ఆలోచించే మాట్లాడా. వైకాపా ప్రభుత్వ అరాచకం, దోపిడీ వల్లే ఆ మాట అన్నా. రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నందువల్లే అలా మాట్లాడా. వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని రాజకీయ వ్యూహం కోసం అనలేదు. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే జనసేన సిద్ధంగా ఉంది. ఎవరి పల్లకీ మోసేందుకు మేం ఇక్కడ లేం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటే ఎందుకంత ఉలుకు?. జనసేన అంటే వైకాపా నేతలకు ఎందుకు భయం? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి ప్రత్యేక రేట్లకు ఎలా అమ్ముతారు? 2018లో కరెంటు ఛార్జీల పెంపును జగన్‌ వ్యతిరేకించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మీరెందుకు కరెంటు ఛార్జీలు పెంచారు? ఇప్పుడున్నది కొత్త తరమని వైకాపా నేతలు అర్థం చేసుకోవాలి. చెత్తపన్ను పెంచారు. వేలాది మంది కౌలు రైతులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. విదేశాలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సదుపాయం రద్దు చేశారు. 100 మంది దగ్గర పన్నులు వసూలు చేసి మీరు అనుకున్న 35 నుంచి 40 మందికో ఇస్తే మిగతా 60.. 65 మంది ఏం కావాలి? కర్నూలు జిల్లాలోనే 353 మంది కౌలు రైతులు చనిపోయారు. అనంతపురంలో 170, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నం పెట్టే రైతుల్లో కులం చూడకూడదు. రైతులకు కులం లేదు.. వారికి అండగా నిలవాలి. రాష్ట్రంలో ఇన్ని వేల మంది రైతులు ఉన్నారు.. సాయం ఎలా చేస్తారని నన్ను అడిగారు. మనసు ఉండి కదిలించగలిగితే సాయం చేయెచ్చు. మొన్న సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లు తీసుకొచ్చా. మనవంతు ఎంతో కొంత సాయం చేయాలి. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న జాతీయ స్థాయి నాయకులు సొంత ఆస్తులు ఇచ్చేశారు.   వైకాపా నేతల ధ్యాసంతా డబ్బు తీసుకోవడంపైనే ఉంది.. ఇవ్వడంలో లేదు. అన్నం తినే ప్రతి ఒక్కరూ రైతు కష్టం గురించి ఆలోచించాలి. ఈ నెల 12న అనంతపురం నుంచి కార్యక్రమం ప్రారంభిస్తాం. కౌలు రైతులకు సాయం చేసే కార్యక్రమానికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశాం.

ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తా..

రాష్ట్ర విభజన సమయంలో ఇంత మంది ఎంపీలు ఉండి విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఇవ్వాలని అడగలేదు. దాని ఫలితమే ఇవాళ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రైవేటికరణను జనసేన వ్యతిరేకిస్తుంది.. కార్మికుల తరఫున అండగా నిలబడతాం. క్రైమ్‌ రేట్‌ పెరుగుతుందంటే పాలనా వ్యవస్థ సరిగాలేదని అర్థం. పొత్తులో ఉన్నప్పుడు 70శాతం ఏకాభిప్రాయం ఉంటే చాలు. ఏకీభవించని అంశాలు చాలా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్రలో బలమైన ప్రాంతీయ కార్యాలయం ఉండాలని కోరుకుంటున్నా. ఇంత బలం ఉండి రాజాం పర్యటనకు వెళితే.. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ, వారిని ఉపయోగించుకోలేక పోయాం.. ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఇక్కడ లేదు. ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తా’’ అని పవన్‌ పేర్కొన్నారు.